గోదావరిఖని : సుందిళ్ల సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంథని నుంచి గోదావరిఖని వైపు వస్తున్న కారు ఎదురుగా గోదావరిఖని నుంచి మంథని వైపు వెళ్తున్న మరో కారును తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుంతలో పడిపోయింది.
ప్రమాద సమయంలో కారు బోల్తా పడటంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటనను గమనించిన ఓ గొర్రెల కాపరి వెంటనే స్పందించి స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికుల సహాయంతో డ్రైవర్‌ను కారులో నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో కారు సగభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








