మెదక్, తూప్రాన్ డివిజన్, సెప్టెంబర్ 5: ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్‌ఏసీ సెక్రటరీ ఆర్. సిరి సౌజన్య పిలుపునిచ్చారు.
శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవడం కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం కక్షిదారులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో చట్టబద్ధమైన న్యాయం అందించడమే లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని సిరి సౌజన్య పేర్కొన్నారు. ఈ నెల 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పలు రకాల కేసులకు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులతో పాటు భూసేకరణ, మున్సిపల్, ఇన్సూరెన్స్, బ్యాంకులకు సంబంధించిన కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.
పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే కేసులకు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని, ఇందుకోసం ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో న్యాయపరమైన ఖర్చులు భరించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని ఆమె అన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సత్వరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు.








