వెల్దుర్తి, తూప్రాన్ : విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన వెల్దుర్తి మండలం షెరిల్లా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మీర్జాపల్లి రఘుపతి (29) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో రఘుపతి, షెరిల్లా గ్రామానికి చెందిన బండ మల్లేష్ వ్యవసాయ పొలానికి గడ్డి కోసే యంత్రంతో వెళ్లాడు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో గడ్డి కోస్తుండగా సమీపంలోని స్టార్టర్ బాక్స్‌కు సంబంధించిన విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుత్ ప్రవాహానికి గురైన రఘుపతి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రఘుపతి మృతితో షెరిల్లా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.








