గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గణేష్ నవరాత్రోత్సవాల నేపథ్యంలో పోలీసుల భద్రతా చర్యలు, గణేష్ విగ్రహాల ఆన్లైన్ నమోదు విధానంపై గన్నేరువరం పోలీసులు వాట్సాప్ గ్రూప్‌లో సమాచారం పంచుకున్నారు. ఈ సమాచారంపై గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పాశం సంతోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. సంతోష్ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో పాటు మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై గన్నేరువరం పోలీసులు సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా పోస్టులు చేయడం, ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, మత విద్వేషాలను ప్రేరేపించే కంటెంట్‌ను ప్రచారం చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం.
గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసే ముందు దాని ప్రభావాన్ని ఆలోచించాలని, అభ్యంతరకరమైన లేదా విద్వేషపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మత సామరస్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే సోషల్ మీడియా పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.








