గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ఇసుక అక్రమ రవాణాపై గన్నేరువరం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న బొలెరో పికప్ వాహనాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్ సమీపంలో సోమవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో పికప్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో రేణికుంట వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఇసుకను అక్రమంగా సిద్దిపేట వైపు తరలిస్తున్నట్లు నిర్ధారించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుని గన్నేరువరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గన్నేరువరం ఎస్‌ఐ జి. నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా ఖనిజాలను తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ప్రయత్నాలను మానుకోవాలని, ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ సూచించారు.
ఇసుక అక్రమ రవాణాపై మండల పరిధిలో నిఘా కొనసాగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించే వాహనాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.








