contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్థానిక ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి: వైఎస్ జగన్

తాడేపల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ‘కురుక్షేత్ర సంగ్రామం’ లాంటివని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల వినియోగం, అక్రమ కేసులు వంటి వాటిని ఎదుర్కొంటూ వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు.

రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జగన్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వెనుక స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశం ఉందనే అనుమానాలు ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.

సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎంతవరకు సజావుగా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.

అక్రమ కేసులతో భయపెట్టలేరు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పారదర్శక ఎన్నికలు సాధ్యం కావని జగన్ విమర్శించారు. ప్రభుత్వం తరచూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

అయితే ఇలాంటి చర్యలకు వైసీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

23 మంది ఎమ్మెల్యేల అంశాన్ని గుర్తుచేసిన జగన్

గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ వైపు తీసుకెళ్లారని జగన్ గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అదే 23 సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారని అన్నారు.

దౌర్జన్యాలు, అబద్ధాలు ఎల్లకాలం కొనసాగవని వ్యాఖ్యానించిన జగన్.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ధైర్యంగా పనిచేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :