contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజాస్వామ్యంపై దాడిని సహించేది లేదు: పద్మ దేవేందర్‌రెడ్డి

మెదక్ : ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మెదక్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మెదక్‌ బస్సు డిపో రోడ్డుపై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించారు.

ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్‌ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పద్మ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తే బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం, వాటి అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షం బాధ్యత అని అన్నారు.

ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను గేటు వద్దే అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులను అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రజా సమస్యలపై గళం వినిపించాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తోందని పద్మ దేవేందర్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు అడ్డుకున్న తీరును ఆమె తప్పుబట్టారు.

అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల గొంతును నొక్కలేరని పద్మ దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎలాంటి నిర్బంధాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అసెంబ్లీని సజావుగా నిర్వహించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కల్పించాలని సూచించారు.

రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పద్మ దేవేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ మరింత బలంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :