తూప్రాన్ : విధి నిర్వహణకు వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆకస్మికంగా మృతి చెందిన విషాద ఘటన తూప్రాన్‌లో చోటుచేసుకుంది. ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన మెదక్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన క్యూఆర్టీ హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో పోలీసు శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. చెక్‌పోస్ట్ విధుల నిమిత్తం మంగళవారం ఆనందం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయనకు ఛాతినొప్పి రావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహిస్తున్న సమయంలో ఆనందం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది వెంటనే సీపీఆర్ నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి ఆనందం మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
సహచరులకు ఆత్మీయుడు..
ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది తెలిపారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉంటూ సహచరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆకస్మిక మృతి వార్త తెలియడంతో పోలీసు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనందంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సహచరులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎస్పీ సంతాపం
హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతిపట్ల జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఆనందం అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆనందం అంత్యక్రియలను బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది అంత్యక్రియలకు హాజరై ఆనందానికి తుది వీడ్కోలు పలకనున్నారు.








