contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకిస్థాన్‌లో పెరుగుతున్న పేదరికం.. నిరుద్యోగం కూడా రికార్డు స్థాయికి

ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ.. పేదరికం, నిరుద్యోగం మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు దేశంలోని సామాన్య ప్రజలపై ఆర్థిక భారం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.

పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే 2025-26ను ఉటంకిస్తూ ‘ది ఫ్రైడే టైమ్స్’ ప్రచురించిన కథనం ప్రకారం.. దేశ జాతీయ పేదరిక రేటు గత ఆర్థిక సంవత్సరంలో 21.9 శాతం ఉండగా, ఈ ఏడాది 28.9 శాతానికి పెరిగింది. దేశంలోని ప్రధాన ప్రావిన్సుల్లోనూ పేదరికం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పంజాబ్‌లో పేదరికం 16.5 శాతం నుంచి 23.3 శాతానికి పెరిగింది. సింధ్‌లో 24.5 శాతం నుంచి 32.6 శాతానికి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 28.7 శాతం నుంచి 35.3 శాతానికి చేరింది. దేశంలో అత్యంత పేద ప్రావిన్స్‌గా ఉన్న బలూచిస్థాన్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్కడ పేదరికం 41.8 శాతం నుంచి 47 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

పెరుగుతున్న నిరుద్యోగం

పేదరికంతో పాటు నిరుద్యోగం కూడా పాకిస్థాన్‌ను తీవ్రంగా వేధిస్తోంది. గత ఏడాది సుమారు 45 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య.. ఈ ఏడాది 59 లక్షలకు పెరిగింది. దీంతో నిరుద్యోగిత రేటు 6.3 శాతం నుంచి 7.1 శాతానికి చేరింది.

ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, ప్రజల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారీగా సంక్షేమ నిధులు

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సామాజిక భద్రతా పథకం ‘బెనజీర్ ఇన్‌కం సపోర్ట్ ప్రోగ్రామ్’ (BISP) కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 722.9 బిలియన్ పాకిస్థానీ రూపాయలు కేటాయించింది. అందులో ఇప్పటికే 540.27 బిలియన్ పాకిస్థానీ రూపాయలు విడుదల చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు నగదు బదిలీలు చేస్తున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పేదరికం తగ్గకపోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.

నగదు బదిలీలతోనే సమస్యకు పరిష్కారం కాదా?

కేవలం నగదు సహాయ పథకాలతో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం సాధ్యం కాదని నివేదిక సూచించింది. ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించడంతో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ పారిశ్రామికీకరణ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అలాగే కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలికంగా ప్రజల ఆదాయాలను పెంచి, సంక్షేమ పథకాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి స్థిరమైన పరిష్కారంగా మారుతుందని వారు సూచిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :