మెదక్ జిల్లా – చేగుంట: గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణీలు, హైరిస్క్ కేసులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
మంగళవారం తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్యం ఏ విధంగా అందుతోంది, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మందుల నిల్వ తదితర అంశాలపై ఆరా తీశారు.
అనంతరం ఆసుపత్రిలోని వివిధ గదులు, మెడికల్ స్టోర్‌ను పరిశీలించారు. వైద్యుల హాజరు, సమయపాలనకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, నెలలు నిండుతున్న గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీ కేసులను గుర్తించి, అవసరమైన సమయంలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైరిస్క్ కేసులను జిల్లా ఆసుపత్రితో ట్యాగ్ చేసి, అవసరమైన వైద్య సేవలు అందేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








