contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్షిత రాణి మృతి: న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన

గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా: సింగరేణిలో ప్రాజెక్ట్ ట్రైనింగ్ కోసం వచ్చిన డిప్లొమా విద్యార్థిని అక్షిత రాణి మృతి గోదావరిఖనిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ మనస్తాపానికి గురైన అక్షిత రాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని లెనిన్ నగర్‌కు చెందిన అక్షిత రాణి రామగుండం ఆర్‌జీ-1 పరిధిలోని 2 ఇంక్లైన్ గనిలో ప్రాజెక్ట్ ట్రైనింగ్ కోసం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఓవర్‌మెన్లు బొమ్మకంటి రవికుమార్, నవీన్ తనను లైంగికంగా వేధిస్తున్నారని అక్షిత రాణి ఇటీవల సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

అయితే తన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోకుండా తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ కేసును క్లోజ్ చేశారని అక్షిత రాణి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు

అక్షిత రాణి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం ఆమె మృతదేహంతో మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్షిత రాణి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆర్‌జీ-1 జీఎంను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.

అదే సమయంలో అక్షిత రాణి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరినప్పటికీ వారు వెంటనే వెనక్కి తగ్గలేదు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మంత్రి హామీతో కొంత ఉపశమనం

పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దళిత సంఘాల నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. అక్షిత రాణి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు.

అయినప్పటికీ కొంతసేపు ఆందోళన కొనసాగింది. చివరకు అక్షిత రాణి మృతికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన విరమించారు.

ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. అక్షిత రాణి ఫిర్యాదు, సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల ఆరోపణలు, సంబంధిత అధికారుల స్పందన వంటి అంశాలపై దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :