వెల్దుర్తి : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు హక్కింపేట డ్యామ్ సమీపానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్‌రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్‌రెడ్డి, గాండ్ల రాజు ఉన్నారు.
వారి వద్ద నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
ప్రజలు జూదం, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.








