contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మెట్ పల్లి లో నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా: వినాయక నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోని వినాయక నిమజ్జన ప్రాంతాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

మెట్‌పల్లి పట్టణంలోని వట్టి వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.. భక్తులు, నిర్వాహకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో స్టేజ్‌లు, విద్యుత్ దీపాలు, వైద్య సేవలు, పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అగ్నిమాపక, మత్స్యశాఖ సిబ్బంది కూడా నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

వినాయక విగ్రహాల శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక, శానిటేషన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. భక్తులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు అధికారులకు సహకరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శోభాయాత్రలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

నిమజ్జన ప్రాంతాల్లో పారిశుధ్య పనులను నిరంతరం చేపట్టడంతో పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :