గోదావరిఖని : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న పనుల పురోగతి, పూర్తికావాల్సిన పనులు, ప్రతిపాదిత అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల మరమ్మతులు, సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ తదితర పనులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వాటి పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు.
నాణ్యత విషయంలో రాజీ వద్దు
అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పనిని నిబంధనల ప్రకారం, నిర్దేశిత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈలు, ఏఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








