contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హెచ్‌ఎంఎస్ అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది: సీఐటీయూ

గోదావరిఖని : సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ చేస్తున్న పోరాటానికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక హెచ్‌ఎంఎస్ నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆర్జీ-2 బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17న జేఏసీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎల్సీ, సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పా)లకు ఉమ్మడిగా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరిగే వరకు అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాలని కోరినట్లు చెప్పారు.

అనంతరం సీఐటీయూ తరఫున సింగరేణి కార్మికులకు ‘సొంతింటి పథకం’ అమలు చేయాలని ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. కంపెనీకి ఎలాంటి ఆర్థిక నష్టం కలగకుండా పథకాన్ని అమలు చేసే విధంగా రూపొందించిన ప్రాజెక్ట్ నివేదికను అధికారులకు అందజేశామని చెప్పారు.

సీఐటీయూ తరఫున ప్రత్యేకంగా వినతిపత్రం అందజేసే సమయంలో అక్కడే ఉన్న హెచ్‌ఎంఎస్ నాయకులు ఫొటోలు తీసుకున్నారని, ఇప్పుడు అదే ఫొటోలను ఫేక్ అంటూ ప్రచారం చేయడం సరికాదని ఆయన విమర్శించారు. కార్మికుల్లో సీఐటీయూకు పెరుగుతున్న ఆదరణను చూసే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంట్రాక్ట్ కార్మికుల సెటిల్‌మెంట్ విషయంలోనూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సంబంధిత ఒప్పంద పత్రాలపై హెచ్‌ఎంఎస్ నాయకుల సంతకాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ వ్యవహారంపై హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ కార్మికులకు, సీఐటీయూకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నిరాధార ప్రచారాలతో కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే వాటిని కార్మిక క్షేత్రంలో ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు.

కార్మికులు అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలని, సీఐటీయూకు అండగా నిలవాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :