contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

న్యాయవ్యవస్థ–పోలీసు శాఖల సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

కరీంనగర్ టౌన్: న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో న్యాయ, పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్. శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్. శివకుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన క్రిమినల్ చట్టాల అమలులో డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణ కీలకంగా మారాయని తెలిపారు. ఇంటర్‌-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) ద్వారా ‘వన్ డేటా–వన్ ఎంట్రీ’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్ దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, కోర్టు రికార్డులను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అనుసంధానం చేయడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ఈ–ఎఫ్‌ఐఆర్, ఈ–చార్జ్‌షీట్, డిజిటల్ సమన్లు, వర్చువల్ విధానంలో సాక్షుల విచారణ వంటి ఆధునిక విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఆన్‌లైన్ ప్రక్రియల అమలుపై ప్రత్యేక దృష్టి

సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ఐసీజేఎస్, సీసీటీఎన్ఎస్‌ ద్వారా అమలవుతున్న ఆన్‌లైన్ ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ–ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత కోర్టులు సకాలంలో స్వీకరించేలా సమన్వయం చేసుకోవాలని, స్వీకరణ సమయంలో పీటీఎన్ నంబర్ నమోదు చేసి పర్యవేక్షణను సులభతరం చేయాలని తెలిపారు.

అదేవిధంగా ఈ–చార్జ్‌షీట్‌లను నిర్ణీత కాలవ్యవధిలో సంబంధిత కోర్టులు పరిగణనలోకి తీసుకునేలా పోలీస్, న్యాయశాఖ అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ–సమ్మన్స్ వినియోగానికి ప్రాధాన్యత

వర్తించే సందర్భాల్లో సాక్షులు, నిందితులకు భౌతిక సమన్లకు బదులుగా ఈ–సమ్మన్స్ విధానాన్ని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఈ విధానం ద్వారా సమన్ల జారీ, అమలులో సమయం ఆదా చేయడంతో పాటు ప్రక్రియ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

కోర్టు, పోలీస్ సిబ్బందికి ఈ–ఎఫ్‌ఐఆర్, ఈ–చార్జ్‌షీట్, ఈ–సమ్మన్స్ విధానాలపై సంయుక్త శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు.

కోర్టు–పోలీసు సమన్వయంతో సమస్యల పరిష్కారం

కేసులకు సంబంధించిన డిజిటల్ ప్రక్రియల్లో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. తీర్పుల ప్రతులు, సాక్షుల వాంగ్మూలాలను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి అందుబాటులో ఉంచడం ద్వారా కేసుల పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించాలని తెలిపారు.

కేసుల పురోగతికి సంబంధించిన ఈ–ఎఫ్‌ఐఆర్‌లు, ఈ–చార్జ్‌షీట్‌లు, స్వీకరించిన లేదా తిరస్కరించిన ఈ–ఎఫ్‌ఐఆర్‌లు, ఈ–సమ్మన్స్ తదితర గణాంకాలను క్రమం తప్పకుండా అందించాలని సూచించారు.

కేసుల దాఖలులో జాప్యం నివారించాలి

ఛార్జ్‌షీట్‌లను అన్ని పని దినాల్లో స్వీకరించేలా సంబంధిత కోర్టులతో సమన్వయం చేసుకోవాలని సీపీ గౌష్ ఆలం సూచించారు. తద్వారా కేసుల దాఖలు ప్రక్రియలో అనవసర జాప్యాన్ని నివారించవచ్చని తెలిపారు.

గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసులకు సంబంధించి కోర్టు పరిధి మారిన నేపథ్యంలో, ఆయా కేసుల స్వీకరణకు సంబంధించిన అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.

న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖలు నిరంతర సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా కోర్టు సంబంధిత ప్రక్రియలను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సీపీ గౌష్ ఆలం సూచించారు.

ఈ సమావేశంలో న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :