contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఓసీపీ-3లో యంత్రాల కొరతపై సీఐటీయూ ఆందోళన

గోదావరిఖని : రామగుండం-2 ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో నెలకొన్న డోజర్ల కొరత, యంత్రాల మరమ్మతుల్లో జాప్యం, అవసరమైన స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది.

ఈ మేరకు మంగళవారం ప్రాజెక్టు మేనేజర్ ద్వారా రామగుండం-2 ఏరియా జనరల్ మేనేజర్‌కు యూనియన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకుండానే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్యానెల్ ఏరియాలు, ఫేసులు, హాల్ రోడ్లు, డంప్ యార్డుల్లో అవసరమైన డోజర్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, లోడింగ్, మట్టి తరలింపు పనులకు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కొత్త యంత్రాలను సమకూర్చకుండా, ఉన్న యంత్రాలకు సకాలంలో మరమ్మతులు చేయకుండా ఉత్పత్తి తగ్గడానికి కార్మికులే కారణమన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలను సీఐటీయూ ఖండించింది.

సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉత్పత్తి లక్ష్యాలు, గణాంకాలతో పాటు కార్మికులకు అవసరమైన యంత్రాలు, భద్రతా సదుపాయాలు కల్పించడం కూడా యాజమాన్యం బాధ్యతేనని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకపోతే ఉత్పత్తి లక్ష్యాలను ఎలా సాధించగలరని ప్రశ్నించారు.

అదేవిధంగా శాస్త్రీయ పద్ధతుల్లో బ్లాస్టింగ్ నిర్వహించకపోవడం వల్ల పెద్ద బండరాళ్లు ఏర్పడి లోడింగ్ పనులు ఆలస్యం అవుతున్నాయని, దీంతో యంత్రాలు దెబ్బతిని రోజుల తరబడి బ్రేక్‌డౌన్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

డోజర్లకు అవసరమైన స్పేర్ పార్ట్స్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, ఏసీ సదుపాయంతో కూడిన మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రివెంటివ్ మెయింటెనెన్స్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు.

యంత్రాల వైఫల్యాలను కప్పిపుచ్చి కార్మికులపై నిందలు వేయడం కాకుండా, ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి బాధ్యతాయుతంగా పనిచేసే వాతావరణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమను గుర్తించి, యంత్రాల కొరతను తక్షణమే పరిష్కరించడంతో పాటు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని సీఐటీయూ తరఫున కోరారు.

ఈ కార్యక్రమంలో పిట్ సెక్రెటరీ రాంప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ వినేష్, శివకుమార్, రాజేందర్, తిరుపతి, సంతోష్ తదితరులతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :