పుంగనూరు : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో పెయింటింగ్ పనులకు నిర్వహించిన టెండర్లపై వివాదం నెలకొంది. టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని, తమను టెండర్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని పలువురు టెండర్ దారులు ఆరోపిస్తున్నారు.
టెండర్ దాఖలు చేసేందుకు వచ్చిన వెంకట్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో పెయింటింగ్ పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. నిబంధనల ప్రకారం బోయకొండ గంగమ్మ దేవస్థానం పేరుతో రూ.3,000 డీడీ తీసుకుని టెండర్ దాఖలు చేసేందుకు దేవస్థానం కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు.
అయితే దేవస్థానం ఈవో సెలవులో ఉన్నారని సిబ్బంది తెలిపిన సమయంలో కొందరు టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి టెండర్ వేయడానికి తాను ఎవరు అంటూ దుర్భాషలాడుతూ తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వెంకట్ యాదవ్ ఆరోపించారు. ఈవో కార్యాలయంలోనే తమపై దాడికి ప్రయత్నించారని, తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దీంతో తాము సీఐకి ఫోన్ చేయగా పోలీసులు స్పందించి నలుగురు కానిస్టేబుళ్లను పంపి తమకు రక్షణ కల్పించారని తెలిపారు.
మరోవైపు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఆలయంలో పెయింటింగ్ పనులు సుమారు 70 శాతం పూర్తయినట్లు గుర్తించామని పలువురు టెండర్ దారులు తెలిపారు. టెండర్ ద్వారా కాంట్రాక్టర్ను ఎంపిక చేయాల్సిన పనులు ముందుగానే ఎలా ప్రారంభమయ్యాయనే విషయంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.
టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అధికారికంగా టెండర్ దాఖలు చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని టెండర్ దారులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, టెండర్ ప్రక్రియలో అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే బోయకొండ గంగమ్మ దేవస్థానం పెయింటింగ్ పనులకు రీ-టెండర్ నిర్వహించి, అన్ని నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా టెండర్ ప్రక్రియ చేపట్టాలని టెండర్ దారులు కోరారు.








