చౌడేపల్లి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతోంది.
సెప్టెంబర్ 16 నుంచి నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా సోమవారం చౌడేపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘం ప్రతినిధి సుమంత్ మాట్లాడుతూ తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేయడం వల్ల సిబ్బందిలో ఆందోళన నెలకొందన్నారు.
వీఆర్ఏల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. అందులో భాగంగా వీఆర్ఏలకు వేతన స్కేల్‌ను అమలు చేయడం, ఖాళీగా ఉన్న స్థానాల్లో నామినీలను నియమించడం, అర్హులైన వీఆర్ఏలకు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించడం, కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులతో పాటు రెడ్డి రాజన్న, రెడ్డిప్ప, భాస్కర్, సావిత్రమ్మ, రెడ్డిరాజా, గంగులప్ప తదితర వీఆర్ఏలు, జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








