తూప్రాన్, మెదక్ జిల్లా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న బ్రాహ్మణపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ గురువారం బ్రాహ్మణపల్లిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమూల్ మిల్క్ బల్క్ యూనిట్ శంకుస్థాపన ప్రదేశం, బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్, వీవీఐపీ కాన్వాయ్ వెళ్లే మార్గాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
పర్యటన సజావుగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ అధికారులకు సూచించారు. సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి, భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్‌ఐలు, రెవెన్యూ శాఖల అధికారులు, అమూల్ యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








