contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యదేచ్ఛగా రేషన్ బియ్యం అమ్మకాలు – పట్టించుకోని అధికారులు

  • కొప్పునూరులో 36వ నంబర్ రేషన్ షాపుపై ఆరోపణలు
  • వీఆర్ఏ ఆధ్వర్యంలోనే విక్రయాలు జరుగుతున్నాయంటున్న స్థానికులు
  • ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని ఆవేదన

 

పల్నాడు జిల్లా – మాచర్ల మండలం : ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మాచర్ల మండలంలోని కొప్పునూరు గ్రామంలో కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని 36వ నంబర్ రేషన్ షాపులో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. 36వ నంబర్ రేషన్ షాపుకు సంబంధించిన డీలర్ కొంతకాలంగా అందుబాటులో లేకపోవడంతో, అక్కడ వీఆర్ఏ రేషన్ షాపు నిర్వహణను చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో రేషన్ బియ్యం పంపిణీకి బదులుగా కొంతమంది లబ్ధిదారులకు నగదు మాత్రమే ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అవసరం ఉన్నప్పటికీ, నగదు తీసుకుని వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని కొందరు లబ్ధిదారులు వాపోతున్నట్లు సమాచారం.

ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు

రేషన్ షాపులో జరుగుతున్న వ్యవహారాలపై గతంలో పలుమార్లు తహసీల్దార్‌తో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రేషన్ పంపిణీలో అక్రమాలపై జర్నలిస్టులు లేదా సాధారణ ప్రజలు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో, సంబంధిత రేషన్ డీలర్లకు ఫిర్యాదు చేసిన వారి వివరాలు చేరుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఫిర్యాదు చేయడానికి ప్రజలు వెనుకడుగు వేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

అధికారులకు తెలిసే జరుగుతోందా?

ఒకవైపు పేదలకు ప్రభుత్వం ఉచితంగా లేదా సబ్సిడీపై అందించే రేషన్ బియ్యం అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తుండగా.. మరోవైపు సంబంధిత రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం ఉందా? లేక అధికారుల దృష్టికి పూర్తిస్థాయిలో సమాచారం చేరలేదా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. కొందరు మాత్రం అక్రమ రేషన్ విక్రయాల వెనుక అధికారుల సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది.

ఉన్నతాధికారులు విచారణ చేయాలి

రేషన్ బియ్యం పేదల అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక భాగం. అలాంటి బియ్యం బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తే, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

కొప్పునూరులోని 36వ నంబర్ రేషన్ షాపులో గత కొన్ని నెలలుగా జరిగిన రేషన్ పంపిణీ, స్టాక్ రిజిస్టర్, లబ్ధిదారుల వివరాలు, బయోమెట్రిక్ నమోదులు, బియ్యం నిల్వలు, పంపిణీ వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :