- కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడుతాం: కుంట ప్రవీణ్ కుమార్
పెద్దపెల్లి జిల్లా – గోదావరిఖని : కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కారాలు సాధించుకోవడం వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రామగుండం-2 బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ అన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్య ఎదురైనా సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
వకీల్‌పల్లి గని వద్ద గురువారం ఉదయం 5 గంటల షిఫ్ట్ సమయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో ప్రత్యేక గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపైనా ఉందన్నారు.
ఎన్నికల సమయంలో కొన్ని కార్మిక సంఘాలు ఉద్యోగులను వివిధ రకాల ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణిలో కొత్తగా చేరిన కార్మికులు ఇలాంటి ప్రచారాలకు, హామీలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్మికులకు న్యాయబద్ధంగా అందాల్సిన వేతన ఒప్పందాలు, ఇతర హక్కుల సాధనలో జాతీయ స్థాయి కార్మిక సంఘాల పాత్ర కీలకమని కుంట ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సింగరేణిలో ఉద్యోగ, సర్వీసు సంబంధిత అంశాలతో పాటు కార్మిక సంఘానికి సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే నేరుగా సీఐటీయూ యూనియన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ నిరంతరం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ తిరుపతి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజశేఖర్, ఆలేటి రాజు, సజ్జత్, సిరాజ్, గుర్రం మహేష్, సుజ్ఞాన్, సమీర్, నరేందర్, వేణు, విజయ్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.








