కాగజ్‌నగర్ : వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా టీజీఎన్‌పీడీసీఎల్ పనిచేస్తోందని జీఎం (ఆపరేషన్-1) బాబురావు తెలిపారు.
మంగళవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రూరల్ పరిధిలోని గన్నారం గ్రామంలో పాడైన 25 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్) స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో రైతులకు సాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు వెంటనే స్పందించారు. ప్రత్యామ్నాయ డీటీఆర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు బాబురావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు విఫలమైన సందర్భాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటి స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నిరంతర విద్యుత్ అందించేందుకు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఏఈ రామ్ ప్రసాద్, డీఈ (ఎంఆర్‌టీ) తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








