మాచర్ల: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రాథమిక విద్య కీలక వేదికగా నిలుస్తుందని పలువురు విద్యాశాఖ అధికారులు, విద్యావేత్తలు పేర్కొన్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్‌లో విద్యార్థుల ఆధ్వర్యంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ విద్యాశాఖాధికారి అల్లి సురేష్, నారాయణ స్కూల్ పల్నాడు జిల్లా ఏజీఎం జానకిరామిరెడ్డి, కోఆర్డినేటర్ గౌసియా హాజరయ్యారు. తొలుత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు గత నాలుగు నెలల్లో నేర్చుకున్న విద్య, నైపుణ్యాలను తల్లిదండ్రులు, అతిథుల ముందు ప్రదర్శించేందుకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. పాఠ్యాంశాలను కేవలం తరగతి గదికే పరిమితం చేయకుండా, విద్యార్థులు స్వయంగా నేర్చుకున్న అంశాలను ప్రదర్శించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందుతాయని వివరించారు.
విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ఫొటోలు, ప్రాజెక్టులు, వివిధ నమూనాల రూపంలో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జిలు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, చంద్రిక, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి, వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రయ్య, డాన్స్ మాస్టర్ శ్రీనివాసరావుతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








