అమరావతి: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసినపుడే కక్షిదారులకు న్యాయం జరుగుతుందని ఏపీ అడ్వొకేట్ జేఏసీ అభిప్రాయపడింది. ఏపీ అడ్వొకేట్ జేఏసీకి చెందిన పలువురు న్యాయవాదులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిలిపివేయాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌లను కొలీజియం సిఫార్సు మేరకు బదిలీ చేయడం సరికాదన్నారు. ఇది సాధారణ బదిలీల్లో భాగంగా జరిగింది కాదని అడ్వొకేట్ జేఏసీ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ అంశంపై గవర్నర్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కూడా కలిసి వివరించినట్లు చెప్పారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. అడ్వొకేట్ జేఏసీ అభ్యంతరాలను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ఈనెల 4న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడకు రానున్నారని.. ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరామని న్యాయవాదులు వివరించారు.