కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల యూనియన్ ఎన్నికల నిర్వహణకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ దండే విఠల్ హామీ ఇచ్చారు. గురువారం ఉదయం జేఏసీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, మిల్లులో నెలకొన్న పరిస్థితులపై వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, త్వరలోనే జేఏసీ నాయకులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు లేబర్ కమిషనర్ వద్దకు తీసుకువెళ్లి, ఎస్పీఎంలో ఎన్నికల ప్రక్రియ త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, పారదర్శక ఎన్నికల నిర్వహణకు జేఏసీ చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సుదీర్ఘ కాలంగా యూనియన్ ఎన్నికలు జరగకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ నాయకులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.








