అనకాపల్లి జిల్లా: గ్రానైట్ క్వారీల కార్యకలాపాలతో తమ గ్రామాల్లో కాలుష్యం, పంట నష్టం, ఇళ్లకు నష్టం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొవ్వుగుంట పంచాయతీ పరిధిలోని కవ్వుకుంట, బుడ్డిబంద, కొమ్మిరి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను అధికారులు తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే. గోవిందరావు, సోలం రాజబాబు డిమాండ్ చేశారు.
కవ్వుకుంట, బుడ్డిబంద, కొమ్మిరి గ్రామాలకు సమీపంలోని వి.మాడుగుల మండలం ఉర్లావ రెవెన్యూ పరిధిలో, వొమ్మలి జగన్నాథపురం పంచాయతీ సమీపంలో కలర్ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని వారు తెలిపారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పలు గ్రానైట్ క్వారీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.
క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము, రాళ్ల తవ్వకాల వల్ల సమీప గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కవ్వుకుంట గ్రామ దేవత ఆలయం వెనుక భాగంలో భూమి దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడిందని, కవ్వుకుంట, బుడ్డిబంద గ్రామాల్లోని కొన్ని ఇళ్లకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ దుమ్ము పొలాల్లోకి చేరడంతో పంటలు దెబ్బతింటున్నాయని, రాత్రివేళ క్వారీల కార్యకలాపాల కారణంగా శబ్ద కాలుష్యంతో నిద్ర కూడా లేకుండా పోతోందని పేర్కొన్నారు.
క్వారీలు ప్రారంభించే సమయంలో గ్రామసభల ద్వారా స్థానిక ప్రజలకు పలు హామీలు ఇచ్చారని సీపీఎం నాయకులు తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్లు, రహదారుల వెంట మొక్కల పెంపకం, వైద్య శిబిరాలు, పాఠశాల భవనాల అభివృద్ధి, సీఎస్‌ఆర్ నిధులు, జిల్లా మినరల్ ఫౌండేషన్ (DMF) ద్వారా అభివృద్ధి పనులు, కార్మికులకు కనీస వేతనాలు వంటి అంశాలపై హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలుపై సరైన శ్రద్ధ లేదని ఆరోపించారు.
కొమిరి పంచాయతీ పరిధిలోని ఎంపీపీ పాఠశాల భవనం అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కోసం సీఎస్‌ఆర్, డీఎంఎఫ్ నిధులు కేటాయించాలని కోరుతున్నా స్పందన కనిపించడం లేదని వారు అన్నారు.
గెలాక్సీ రాక్ గ్రానైట్ క్వారీ 2003లో ప్రారంభమైందని, ఆ తర్వాత మరిన్ని క్వారీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని సీపీఎం నాయకులు తెలిపారు. దాదాపు 23 ఏళ్లుగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ, క్వారీల ప్రభావానికి గురవుతున్న గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని వారు విమర్శించారు.
“క్వారీల ద్వారా వచ్చే ఆదాయం మరో ప్రాంతానికి వెళ్తుండగా, వాటి వల్ల కలిగే నష్టం మాత్రం కవ్వుకుంట, బుడ్డిబంద, కొమ్మిరి గ్రామాల ప్రజలు భరిస్తున్నారు. ఇది ఏ విధమైన న్యాయం?” అని వారు ప్రశ్నించారు.
గ్రామాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అధికారులు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఒక్కరోజైనా కవ్వుకుంట, బుడ్డిబంద గ్రామాల్లో రాత్రి బస చేస్తే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా అర్థమవుతాయని అన్నారు.
క్వారీల ప్రభావిత ప్రాంతంలోనే తక్షణం గ్రామసభ నిర్వహించాలని, బీవీజేపురం వద్ద కాకుండా కవ్వుకుంట రెవెన్యూ పరిధిని ఆనుకుని ఉన్న ఉర్లావ రెవెన్యూ ప్రాంతంలో గ్రామసభ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి జాయింట్ కలెక్టర్ వెంటనే గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కే. గోవిందరావు, సోలం రాజబాబు కోరారు. కాలుష్యం, పంట నష్టం, ఇళ్లకు జరుగుతున్న నష్టం, సీఎస్‌ఆర్–డీఎంఎఫ్ నిధుల వినియోగం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.









