contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దక్షిణ కొరియాలో నారా లోకేశ్‌ పెట్టుబడుల దౌత్యం .. ఏపీలో భారీ ఫుట్‌వేర్‌ హబ్‌కు ప్రతిపాదనలు

అమరావతి/బుసాన్: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. బుసాన్‌లో ప్రముఖ హ్వాసంగ్‌ గ్రూప్‌ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారత ఫుట్‌వేర్‌ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు ప్రతిష్ఠాత్మక ప్రతిపాదనలు చేశారు.

సమావేశంలో కుప్పంలో హ్వాసంగ్‌ ఫుట్‌వేర్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులకు మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. అదే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ ఫుట్‌వేర్‌ కాంపొనెంట్‌ మరియు మెటీరియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వివరించారు.

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రీమియం బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కస్టమైజేషన్‌, పర్యావరణ హిత మెటీరియల్స్‌పై పరిశోధనలు జరిగే నెక్స్ట్‌ జనరేషన్‌ అథ్లెటిక్‌ ఫుట్‌వేర్‌ ఆర్‌అండ్‌డీ మరియు ఆసియా-పసిఫిక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు సేవలందించేలా సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ప్రణాళికలో కుప్పంలో ప్రధాన కార్యాలయం, తిరుపతిలో విడిభాగాల తయారీ కేంద్రం, విశాఖపట్నంలో డిజైన్‌, కార్పొరేట్‌ మరియు లాజిస్టిక్స్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని వివరించారు. హ్వాసంగ్‌కు చెందిన టైర్‌-1, టైర్‌-2 సరఫరాదారులతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సప్లయర్‌ మీట్‌ను నిర్వహించాలని కూడా కోరారు.

మంత్రి ప్రతిపాదనలపై స్పందించిన హ్వాసంగ్‌ కార్పొరేషన్‌ బిజినెస్‌ సీఈవో హెయో సియోంగ్‌-రియోంగ్‌, కుప్పంలో రూ.900 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ నాన్‌-లెదర్‌ ఫుట్‌వేర్‌ ప్లాంట్‌ను ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. అడిడాస్‌తో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు ఓఈఎం సరఫరాదారుగా ఉన్న ఈ ప్లాంట్‌లో ప్రతి ఏడాది 2 కోట్ల జతల స్పోర్ట్స్‌ షూలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రారంభంలో ఎగుమతులనే ప్రధాన లక్ష్యంగా ఉత్పత్తి చేపట్టి, అనంతరం దేశీయ మార్కెట్‌కు కూడా విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పుణే, చెన్నై, అనంతపురం జిల్లా గూడపల్లిలో ఆటో విడిభాగాల తయారీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, భవిష్యత్‌ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌వేర్‌, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయని, రాష్ట్రాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :