అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని అంట్లపాలెం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గ్రామంలో నివసిస్తున్న సుమారు 30 గిరిజన కుటుంబాలు గత మూడు నెలలుగా మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గ్రామంలోని బోర్వెల్ మూడు నెలల క్రితం మరమ్మతుల కోసం అధికారులు తొలగించి తీసుకెళ్లినప్పటి నుంచి తిరిగి బిగించకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం సమీప రైతుల పామాయిల్ తోటలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రతిరోజూ దూరం వెళ్లి నీరు తీసుకురావాల్సి వస్తోందని వాపోయారు.
ప్రభుత్వం అమృతధార (జల్ జీవన్ మిషన్ – జేజేఎం) పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని గ్రామస్థులు ఆరోపించారు. తాగునీటి కోసం ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు స్పందించి, బోర్వెల్ను వెంటనే పునరుద్ధరించి గ్రామానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామానికి చెందిన బి. లావా, మూలపర్తి పద్మ, అప్పిల నూకరాజు, గడ్డం శ్రీను తదితర గిరిజనులు డిమాండ్ చేశారు.
గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గిరిజన కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.








