- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి
- వైద్యాధికారులకు సూచించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు
వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్యం పై దృష్టి సారించాలని, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారులకు సూచించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మరీ ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.
ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయన మంగళవారం స్పందించారు. కురుస్తున్న వర్షాలకు పారిశుద్ధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, దీని పై అధికారులు అప్రమత్తం కావలసిన అవసరం ఉందన్నారు. వర్షపు నీటి నిల్వలు దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఉందని, వీటిని అరికట్టడానికి కావలసిన నివారణ చర్యలు చేపట్టాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ సూచించారు. అంతేకాకుండా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా అధికారులు ముందుకు సాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనీ, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మరీ ముఖ్యంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు చక్కగా, పనిచేయాలని, వైద్యాధికారులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ప్రజలు కూడా ప్రమాదకర వ్యాధుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు, ఆరోగ్య సూత్రాలను పాటించాలని దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు ప్రజలకు తెలియజేశారు
ఏపీ సీఎం చంద్రబాబు కృషిని కొనియాడిన చిత్తూరు ఎంపీ
చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలు బెజవాడను నీట మునిగేలా చేసాయని, అయితే అపార అనుభవం కలిగిన, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరద ముంపు నుంచి విజయవాడను బయట పడేసేందుకు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయని చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కృషిని కొనియాడారు. 76 ఏళ్ల వయసులో కూడా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా నిలిచేందుకు స్వయంగా సహాయక చర్యలో పాల్గొనడం స్ఫూర్తిదాయమన్నారు.
అంతేకాకుండా అధికారులకు దిశ నిర్దేశం చేస్తూ, విజయవాడలోని సింగ్ నగర్ పరిసర ప్రాంతాలలో ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తానందించి, ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శంగా నిలిచారని తెలిపారు. అదే సమయంలో వరద బాధితులను అన్ని రకాల ఆదుకునేందుకు చేపట్టిన సహాయక చర్యలు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. వరద ముప్పు చిక్కుకున్న బాధితులను గుర్తించి, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. ఇప్పుడు విజయవాడలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియ వచ్చిందన్నారు.