contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: ఎమ్మెల్యే పులివర్తి నాని

చంద్రగిరి : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం ఉట్లవారిపల్లి వద్ద వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అభివృద్ధి పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను, ఆలయ కమిటీ సభ్యులను ఆదేశించారు. శనివారం ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, రాబోయే ఆగస్టు నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆడికృత్తిక ఉత్సవాల నాటికి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన స్థలాన్ని, అలాగే భక్తుల కోసం నిర్మించ తలపెట్టిన పుష్కరిణి (కోనేరు) నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేస్తూ అభివృద్ధి పనుల ప్రణాళికపై చర్చించారు.

“సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. దాతల ఉదార సహకారం, భక్తుల ఆశీస్సులు మరియు అందరి భాగస్వామ్యంతో ఈ పుణ్యక్షేత్రాన్ని నియోజకవర్గంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం” అని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాకాల మండల ప్రముఖ నాయకులు, కూటమి కార్యకర్తలు, ఆలయ సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :