హైదరాబాద్ : అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఈడీ కార్యాలయాల ముందు ఆందోళనల్లో భాగంగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. తొలుత గన్ పార్కు వద్ద సమావేశమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పోరేషన్ల చైర్మన్లు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెబీ నిబంధనలు ఉల్లంఘించిన సెబీ చీఫ్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్థలపైనా ఆరోపణలపై జేపీసీ విచారణకు ఆదేశించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.