contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విద్యార్థులపై వ్యాపారం .. బయటపడిన సంచలన నిజాలు

కృష్ణా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి బ్లాక్‌ బోర్డ్‌ వైపు చూస్తూ మగతగా నిద్రలోకి జారుకున్నాడు.ఇదే విషయాన్ని ఉపాధ్యాయులు పలుమార్లు గుర్తించారు. ఇలాగే మరికొంత మంది ఉన్నారని నిర్ధారించుకున్నారు. వీరి కదలికలు, పరిచయాలపై నిఘా వేశారు. విశ్రాంతి సమయంలో పాఠశాల ప్రహరీ అవతల కొందరు చేరుతుండడంపై ఆరా తీశారు. అనుమానిత విద్యార్థులను తనఖీ చేశారు. ఇద్దరి వద్ద చిన్న గంజాయి పొట్లాలు దొరికాయి.

విజయవాడకు సమీపంలోని మరో కార్పొరేట్‌ పాఠశాల ప్రహరీపై నుంచి చిన్న పొట్లాలు లోపల పడడాన్ని సిబ్బంది గుర్తించారు. వీటిలోనూ గంజాయి ఉందని నిర్ధారించారు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. తర్వాత పోలీసుల సహకారంతో చుట్టూ నిఘా ఏర్పాటు చేశారు.

పాఠశాలల పిల్లలు కూడా మత్తుకు బానిసలవుతున్నారనడానికి ఈ రెండు ఘటనలు ప్రత్యక్ష నిదర్శనాలు. మొన్నటి వరకు గంజాయి మాత్రమే పాఠశాలల్లో దొరికేది. ప్రస్తుతం రంగుల్లో వాడే టిన్నర్‌(థిన్నర్‌), రబ్బరు, ప్లాస్టిక్‌లను అతికించే కొన్నిరకాల గమ్ము, గోళ్ల రంగులు, వైట్నర్‌ లాంటివి అధికంగా వినియోగిస్తున్నారు. ఈ మత్తు పదార్థాలను వినియోగించే సన్నటి గొట్టాలు, పాలిథిన్‌ కవర్లు విద్యార్థుల దగ్గర అధికంగా దొరకుతున్నాయి. తాజాగా రెండు పాఠశాలల సమీపంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాటు వేసి ఆరుగురు విద్యార్థులను పట్టుకున్నారు. గత మూడు నెలల్లో ఎనిమిదిసార్లు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పట్టుబడిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పర్యావసానాలు ఏవిధంగా ఉంటాయోనని ప్రధానోపాధ్యాయులు, పోలీసులు ఆలోచిస్తున్నారు.

బడి గేటుకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

విద్యార్థులు చెప్పిన వాస్తవాలివి…

  •  నేను గత రెండు నెలలుగా మానేశాను. రాత్రి అమ్మానాన్న పోట్లాడుకున్నారు. నా మనసు బాగోలేదు. ‘దమ్ము’ పీల్చడానికి కవర్‌ చేతిలో పెట్టుకున్న సమయంలోనే ఉపాధ్యాయులు పట్టుకున్నారు. నేను తాగలేదు.
  •  వివిధ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు నాకు తెలిసినవాళ్లే 20 మంది వరకూ ఉన్నారు. బయట యువకులు చాలా మంది ఉంటారు. ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ద్వారా ఇది జరుగుతోంది. అతనే ఫోనులో అందరినీ పిలుస్తుంటాడు.
  •  కొత్తగా పీల్చినవారికి దగ్గు వస్తుంది. రెండు మూడు రోజులకు అలవాటవుతుంది. పీల్చగానే హుషారుగా, ఆనందంగా ఉంటుంది. తలకు మత్తు ఎక్కుతుంది. ఎవరైనా కర్రతో కొట్టినా నొప్పి ఉండదు. అమ్మానాన్న ఒట్టేయించుకున్నారు. ఇపుడు తాగడం లేదు. వారి దగ్గరకు వెళ్లాను. అంతలోనే పట్టుకున్నారు.

విద్యార్థులపై వ్యాపారం చేస్తూ..

విద్యార్థుల వద్ద లభ్యమైన ఎడ్‌హెసివ్‌ ట్యూబ్‌లు

వివిధ కంపెనీల జిగురు ట్యూబ్‌లను విద్యార్థులకు విక్రయించొద్దని పోలీసులు, ప్రధానోపాధ్యాయులు దుకాణదారులకు సూచిస్తున్నారు. అయినా కొంతమంది వ్యాపారులు రూ.30 విలువ చేసే ట్యూబ్‌ను రూ.100కి విక్రయిస్తూ ఆదాయార్జన చేస్తున్నారు. మూడు నెలల క్రితం గంజాయి కూడా కొన్ని బడ్డీ కొట్లలో లభ్యమైంది. జిగురును కూడా ఒక పాలిథిన్‌ కవర్‌లో వేసి ఒకసారి పీల్చితే(ఒక దమ్ముకు) రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. ఒక్కో ట్యూబ్‌ ద్వారా రూ.200 వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా కొందరు యువకులు ఇలాంటి మత్తు వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అలాంటి వారిని గుర్తించే పని ఆరంభించారు.

ఇలాంటివి సహించేదిలేదు

బాలలకు మత్తు అలవాటు చేస్తున్న వారిపై నిఘా వేశాం. చాలావరకు కట్టడి చేశాం. ముందు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. కుటుంబ వివాదాల ప్రభావం పిల్లలపై పడనీయకూడదు. పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు. అసాధారణంగా వ్యవహరిస్తున్నారా? చదువుపై శ్రద్ధ పెడుతున్నారా? వంటి అంశాలను గమనిస్తూ ఉండాలి. ఇది సున్నితమైన అంశం. సమస్య పరిష్కారానికి సహకరించాలి.

కాశీవిశ్వనాథ్‌, కంకిపాడు సీఐ

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :