contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి మంథని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎ. సుధారాణి రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 నవంబర్ 13న ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో లక్కారం గ్రామానికి చెందిన కన్నూరి అనసూయ కుమారుడు కన్నూరి శ్రీనివాస్ (18) కూలి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నాగేపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. TS 25 T 0679 నంబరు గల టిప్పర్ లారీని నిందితుడు కురకుల అశోక్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాస్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదు నమోదైంది.

ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత పెద్దపల్లి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా ప్రగతిపూర్ వద్ద అదే రోజు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్‌ఐ పి. శంకరయ్య కేసును దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించారు. అనంతరం కోర్టులో విచారణ కొనసాగింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్ధ కుమార్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. అందుబాటులో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు కురకుల అశోక్‌కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.

కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణలో సమర్థవంతంగా సహకరించిన కోర్టు డ్యూటీ అధికారి ఏ. మల్లేష్, ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్ధ కుమార్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :