భారత్‌లో వంట నూనెల భద్రతను బలోపేతం చేయడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో పామాయిల్ కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు స్పష్టం చేశారు. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా పామాయిల్‌పై జరుగుతున్న దుష్ప్రచారం ఆందోళన కలిగించే అంశమని వారు పేర్కొన్నారు. ఈ మేరకు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
పామాయిల్‌పై నిర్వహించిన సదస్సులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సలహాదారు డాక్టర్ అల్కా రావు మాట్లాడుతూ.. శాస్త్రీయమైన, కచ్చితమైన ఆధారాలు లేకుండా ఏ ఆహార పదార్థాన్ని ప్రోత్సహించబోమని, అలాగే తప్పుబట్టబోమని స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంటకు అనువుగా ఉండటం వల్ల భారత గృహాలతో పాటు ఫుడ్ ఇండస్ట్రీలో కూడా పామాయిల్ వినియోగం కొనసాగుతోందని ఆమె తెలిపారు.
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు ఆర్థిక సలహాదారు డాక్టర్ శ్రీరిషి కాంత్ మాట్లాడుతూ.. దేశంలో పామాయిల్ దిగుమతులను తగ్గించేందుకు దేశీయ సాగును బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ వంటి పథకాల ద్వారా రైతులకు మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. 2025-26 నాటికి పామాయిల్ సాగు లక్ష్యాన్ని 6.5 లక్షల హెక్టార్ల నుంచి దాదాపు 10 లక్షల హెక్టార్లకు పెంచినట్లు వెల్లడించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, అసంపూర్ణ డేటా ఆధారంగా పామాయిల్‌పై అపోహలు పెరిగాయని పీహెచ్‌డీసీసీఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వంట నూనెలలో పామాయిల్ ముందంజలో ఉందని, తక్కువ ధరలో అధిక ఉత్పాదకత కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణమని వివరించారు.
సరైన మోతాదులో వినియోగిస్తే పామాయిల్ ద్వారా శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు అందుతాయని, ప్రజలు శాస్త్రీయ సమాచారాన్నే నమ్మాలని నిపుణులు సూచించారు.








