హైదరాబాద్ : మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) వేడుకలకు ఆంధ్రప్రదేశ్ లోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవాల కోసం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
ఇవాళ హైదరాబాదులోని చిరంజీవి సినిమా సెట్స్ వద్దకు వెళ్లిన సుధీర్ రెడ్డి… ఆయనకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు కూడా కుటుంబసమేతంగా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను చిరంజీవికి సుధీర్ రెడ్డి వివరించారు.