పార్వతీపురం : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం కావాలని ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.వైశాలి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర సేకరణ ప్రగతి మరియు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై శుక్రవారం ఆమె ఛాంబరులో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు, పథకాల అమలులో పురోగతిని అధికారులు వివరంగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాడి ఆవుల పంపిణీకి సంబంధించి అర్హులైన లబ్ధిదారులను తక్షణమే గుర్తించాలని ఆదేశించారు. అలాగే, పశుగ్రాసం కోతకు ఉపయోగపడే ‘చాఫ్ కట్టర్ల’ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీని ద్వారా పశుపోషకులకు అండగా నిలవాలని సూచించారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు డ్రాగ్ నెట్ల పంపిణీకి తగిన లబ్ధిదారులను, ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరారు. చేపల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా పోర్టబుల్ హేచరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను మరియు ఆసక్తి గల లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అందాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి, నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎస్. మన్మధరావు, జిల్లా మత్స్య శాఖాధికారి టి. సంతోష్ కుమార్, ఎం.హెచ్.ఓ, డిఆర్డిఏ డిపిఎంలు మరియు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.








