contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్మార్ట్ సిటీలో వెలుగులు మాయమా..? చీకటిలో కాకినాడ నగరం

కాకినాడ: ఒకప్పుడు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభంతో అత్యాధునిక వీధి దీపాల వెలుగులతో తళతళలాడిన కాకినాడ నగరం, ప్రస్తుతం సరైన నిర్వహణ లేక అంధకారంలో మగ్గుతోందని పౌర సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని వీధి దీపాల నిర్వహణలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సంఘం ఆరోపించింది.

సంఘం వెల్లడించిన క్షేత్రస్థాయి వివరాల ప్రకారం, నగరంలోని మొత్తం వీధి దీపాల్లో సుమారు 20 శాతం దీపాలు పనిచేయడం లేదు. అధికారిక రికార్డుల్లో సమస్యలు తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంది. ప్రతి వంద వీధి దీపాల్లో దాదాపు 20 దీపాలు వెలగకపోవడం నగరపాలక సంస్థ పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని విమర్శించింది.

స్మార్ట్ సిటీ అసెట్ రికార్డుల ప్రకారం నగరంలోని 50 డివిజన్ల పరిధిలో 26,780కు పైగా నమోదిత వీధి దీపాలు ఉన్నప్పటికీ, వాటిలో సుమారు 5,100కుపైగా దీపాలు నిరంతరం పనిచేయడం లేదని పౌర సంఘం తెలిపింది. మరోవైపు నగర శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నా, రికార్డుల ప్రకారం మంజూరైన 2,150 కొత్త విద్యుత్ స్తంభాలు, కొత్త వీధి దీపాల ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదని పేర్కొంది. దీంతో కొత్త కాలనీల ప్రజలు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, పార్కులు మాత్రమే కాకుండా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలు కూడా తగిన వెలుతురు లేక చీకటిలోనే ఉన్నాయని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలు, బాధితులు చీకటి కారణంగా భయపడుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొంది.

ప్రజలు సాయంత్రం వేళల్లో విశ్రాంతి కోసం వచ్చే మున్సిపల్ పార్కుల్లో కూడా లైటింగ్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆరోపించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆధునిక విద్యుత్ దీపాలు అనేక ప్రాంతాల్లో పనిచేయకపోవడంతో పార్కులు అంధకారంలో మగ్గుతున్నాయని తెలిపింది. ఎస్పీ కార్యాలయ రోడ్డులో ఏర్పాటు చేసిన దీపాలు కూడా వెలగడం లేదని, ప్రధాన కూడళ్లలో ఉన్న ప్రముఖుల విగ్రహాలకు ఫ్లడ్ లైట్లు లేకపోవడం విచారకరమని పేర్కొంది. కరోనా లాక్‌డౌన్‌కు ముందు వరకు వెలిగిన కుళాయిచెరువు పార్కులోని స్వామి వివేకానంద విగ్రహానికి ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని వెల్లడించింది.

అంతర్గత వీధుల్లో తక్కువ వాటేజ్ కలిగిన డిమ్ లైట్లు మాత్రమే ఉండటంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం తెలిపింది. ఈ చీకటిని ఆసరాగా చేసుకుని రోడ్ల పక్కన, పార్కుల పరిసరాల్లో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందని, వీధి కుక్కల సంచారం, దాడులు కూడా అధికమయ్యాయని పేర్కొంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు అత్యవసర పరిస్థితుల్లో కూడా రాత్రి బయటకు రావడానికి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

మున్సిపల్ చట్టం ప్రకారం వీధి దీపాల నిర్వహణలో ఇలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నగరానికి వెంటనే “చీకటి విముక్తి” కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే నగరంలో ఎక్కడ చీకటి ఉంటే అక్కడ కాగడాలు, కొవ్వొత్తులతో బహిరంగ నిరసనలు నిర్వహించి ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :