కాకినాడ : స్మార్ట్ సిటీ అభివృద్ధి పేరుతో కాకినాడ నగరంలోని రహదారుల వెంట ఉన్న ఆరోగ్యకరమైన వృక్షాలకు వైట్ సిమెంట్ ఆధారిత పెయింట్లు, వాల్ పుట్టీ బేస్ కోటింగ్ వేయడం పర్యావరణానికి తీవ్ర హానికరమని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పలు ఆరోపణలు చేశారు.
గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో కూడా ఇదే తరహాలో చెట్లకు గోడలకు ఉపయోగించే వైట్ సిమెంట్ ఆధారిత రంగులు పూయడంతో వందలాది వృక్షాలు దెబ్బతిన్నాయని, అధికారులు గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా అదే తప్పును మరోసారి పునరావృతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
చెట్ల బెరడుపై సింథటిక్ పెయింట్లు, వాల్ పుట్టీలు పూయడం వల్ల అవి కాంక్రీట్ పొరలా గట్టిపడి చెట్లలో ఉండే లెంటిసెల్స్ అనే సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతాయని, దీంతో చెట్లు శ్వాస తీసుకునే ప్రక్రియ దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో చెట్ల ఎదుగుదల మందగించడం, బెరడు దెబ్బతినడం, ఫంగస్, చెదలు సోకడం, విష రసాయనాలు అంతర్గత కణజాలాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. దీని వల్ల నగర ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) 2013, 2015 మార్గదర్శకాల ప్రకారం చెట్లకు సింథటిక్ పెయింట్లు వేయడం నిషేధితమని, అవసరమైతే అటవీశాఖ సూచించే బోర్డో మిశ్రమం (సున్నం-కాపర్ సల్ఫేట్) మాత్రమే నేల నుంచి సుమారు నాలుగు అడుగుల ఎత్తు వరకు ఉపయోగించాలని నిబంధనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 నిబంధనలను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే రంగులు పూసిన చెట్లపై నిపుణుల సలహాతో సురక్షిత చర్యలు చేపట్టి, అవసరమైతే ఆ పూతను తొలగించాలని, ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రమణరాజు డిమాండ్ చేశారు.
నగరంలో సుమారు 35 వేల కోనోకార్పస్ వృక్షాలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రహదారుల వెంట ఉన్నాయని పేర్కొంటూ, ఈ వృక్షాలు పర్యావరణానికి ఆశించినంత ప్రయోజనం కలిగించడం లేదని, వాటి స్థానంలో స్థానిక జీవవైవిధ్యానికి అనుకూలమైన వృక్షాలను పెంచే దిశగా చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే నగరంలో రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించకుండా కేవలం సిటీ బ్యూటిఫికేషన్ పేరుతో రంగుల కార్యక్రమాలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను, ఇతర బకాయిలను వసూలు చేసి నగర అభివృద్ధికి వినియోగించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్న ఆయన, ఎక్కడైనా చెట్లకు హానికరంగా రంగులు వేస్తున్నట్లు గమనిస్తే సంబంధిత అధికారులకు, ప్రభుత్వ గ్రీవెన్స్ వ్యవస్థకు లేదా సంబంధిత పర్యావరణ సంస్థలకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ ఆరోపణలపై కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.








