కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్‌నగర్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కేశవరావు కమిటీ’ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక హర్షాతిరేకాలతో స్వాగతించింది. శనివారం కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ, కొందరు తప్పుడు వ్యక్తులు ఉద్యమకారుల పేరుతో సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
అసలైన ఉద్యమకారులు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన, బోగస్ ఉద్యమకారులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్ సహకారంతో త్వరలోనే కేశవరావు కమిటీ చైర్మన్‌ను కలిసి ఉద్యమకారుల సమస్యలు, గుర్తింపు అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, గాయపడిన వారు, ఉద్యమ కేసులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కమిటీ చైర్మన్‌ను కలిసిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉద్యమకారుల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో నిర్బంధాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తమకు తగిన గుర్తింపు లభించలేదని పలువురు ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఉద్యమకారులు పాల్వాయి సుధాకర్ రావు, సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, సుభాష్, రమేష్ గౌడ్, జయదేవ్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.








