కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్‌పేట్: కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. రియాజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపునిచ్చారు.
పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో దాహేగాం, పెంచికల్‌పేట్ మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన డా. రియాజ్, ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఓటరు జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల పేర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చే ప్రక్రియలో బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులను నిర్వర్తిస్తూ, ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోతుగంటి భీమన్న, సముద్రాల రాజన్న, సర్పంచులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








