గన్నేరువరం (కరీంనగర్ జిల్లా) : గన్నేరువరం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 26వ విడతలో భాగంగా 50 మంది లబ్ధిదారులకు రూ.18,66,500 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకోవడమే ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స కోసం అప్పుల పాలవకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న ఆయన, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ ఇప్ప నరేందర్, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, ఖాసీంపేట సర్పంచ్ కర్నే చంద్రయ్య, చీమలకుంటపల్లి సర్పంచ్ జంగటి ప్రకాష్, మాజీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, అలువాల కోటి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, మండల మహిళా అధ్యక్షురాలు జెల్ల రాజేశ్వరి, పరిపూర్ణ చారి, గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాదాపూర్‌లో నూతన రేషన్ దుకాణం ప్రారంభం
అనంతరం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త రేషన్ షాపులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు గ్రామాల్లోనే సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
రేషన్ దుకాణాల్లో తూకాల్లో మోసం చేయడం, ప్రభుత్వ సరుకులను పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి డీలర్‌పై ఉందని స్పష్టం చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో తహశీల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ సర్పంచ్ మాదరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, మాజీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, అలువాల కోటి, మాతంగి అనిల్, జెల్ల రాజేశ్వరి, అంజి తదితరులు పాల్గొన్నారు.








