కరీంనగర్ జిల్లా: వ్యవసాయ బావుల్లో బండరాల్లను పగలగొట్టేందుకు వినియోగించే జిలిటెన్ స్టిక్స్ ను నివాస గృహాల మధ్య పేల్చడం మంగళవారం గన్నేరువరం మండల కేంద్రంలో కలకలం రేపింది. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీ ఇండ్ల సమీపంలో ఉన్న వ్యవసాయ బావులలలో పూడికే తీసేందుకు రాళ్లు అడ్డువస్తున్నాయని ఉద్దేశంతో పేలుడు పదార్థాలు వినియోగించారు. ఈ విషయంపై స్థానికులకు సమాచారం ఇవ్వకపోవడంతో పేలుడు శబ్దాలతో భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దానికి ఇండ్ల నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. వ్యవసాయ బావి సమీపంలోని ఇండ్లు కూడా పేలుడు దాటికి ఊగిపోవడంతో గోడలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మరోసారి పేలుళ్లు జరిపేందుకు వ్యవసాయ బావులలో పేలుడు పదార్థాలను అమర్చడంతో స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మందు పాత్రలు పెట్టడంపై స్థానికులు బగ్గుమంటున్నారు. పేలుడు పదార్థాలు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్కు కూత వేట దూరంలోనే పేలుడు ఘటనలు జరగడం గమనార్హం.
