కరీంనగర్ జిల్లా, గన్నేరువరం: రాష్ట్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యా విధానంలో భాగంగా గన్నేరువరం మండలంలో నాలుగు ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మండలంలోని గన్నేరువరం, మైలారం, ఖాసీంపేట, గునుకుల కొండాపూర్ గ్రామాల ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరయ్యాయి.
ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఒక టీచర్, ఒక ఆయా చొప్పున పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం మండల విద్యాధికారి (ఎంఈఓ) కె. రామయ్య నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన టీచర్లు, ఆయాలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ, చిన్నారుల బోధనా విధానాలు, బాధ్యతలు, విధి నిర్వహణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలల ద్వారా గ్రామీణ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు, చిన్న వయస్సు నుంచే విద్యాపై ఆసక్తి పెంపొందించే అవకాశం కలుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంతో మండలంలో ప్రాథమిక విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








