గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో వీధికుక్కల బెడద తీవ్రంగా మారిందని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నూర్ గ్రామంలోని రహదారులపై కుక్కలు గుంపులుగా సంచరిస్తూ వాహనాలను వెంబడిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే సమయంలో ఒక్కసారిగా కుక్కలు మీదకు దూకేందుకు ప్రయత్నిస్తుండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు అదుపుతప్పి కిందపడటం లేదా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
రాత్రి వేళల్లో సింగరేణి కార్మికులు విధులకు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. నడుచుకుంటూ వెళ్లేవారిని కూడా కుక్కల గుంపులు వెంబడిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే పలుమార్లు కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వాహనదారులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రహదారులపై ప్రయాణించే వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








