- పార్టీ మారినా మాఫియా మారలేదు
- సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా, మదనపల్లి : అధికార పార్టీ అండదందడలతో మైనింగ్ మాఫియా చెలరేగి పోయి ఇసుక, మట్టి కొల్లగొడుతున్నదని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. పార్టీలు మారినా మైనింగ్ మాఫియా మారలేదని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరుతున్నారని వివరించారు. ఆదివారం మదనపల్లి పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానం కారణంగా జిల్లాలో ఉన్న ప్రజలకి ఇసుక అందుబాటులోకి లేకుండా పోయిందని అన్నారు. భవన నిర్మాణం పనులు జరగడం లేదని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. మైనింగ్ మాఫియా మాత్రం అధికార పార్టీ అండదండలతో పెద్ద ఎత్తున ఇసుకను తరలించకపోతున్నారని అన్నారు. మదనపల్లి పట్టణ సమీపంలో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నందు బార్లపల్లి మోహన్, మధుసూదన్ రెడ్డి, అంకిశెట్టిపల్లి జగదీష్, మణికుమార్, ఏఎన్ఎస్ శ్రీనివాసులు, అమర తదితరులు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు టిప్పర్లతో లక్షల విలువ చేసే ఇసుకను తోడి, తరలిస్తున్నారని అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు ప్రసాద్ రెడ్డి, రాంబాబు మొదలగు వారు ఇసుక మైనింగ్ లో ఆరితేరిపోయారని బహుదా, మహల్, కలకడ మొదలగు ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తోడేసి అమ్ముకున్నారని, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చౌడేపల్లి మండలం, చదల్ల వద్ద హిటాచీలతో ఇసుకను అక్రమంగా తోడుకుని ఒక టిప్పర్ ధర 10 నుంచి 15 వేల రూపాయలకు అమ్ముకుంటూ రోజుకు 50 నుంచి 100 టిప్పర్ల ఇసుకను తరలించేస్తున్నారని వివరించారు. నిమ్మనపల్లి మండలం అగ్రహారం వద్ద కూడా షంషీర్ కనుసన్నంలో ప్రతిరోజు ఇసుకను మదనపల్లెకు అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టని ఇసుక ట్రాక్టర్లు మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నాయని, ఒక్క టిప్పర్ కూడా అధికారుల కంట పడలేదంటే అనుమానం కలుగుతోందని అన్నారు. మైనింగ్, ఎస్ఇబి, ఇరిగేషన్ రెవెన్యూ, పోలీసు అధికారులు మాఫియాతో కుమ్మక్కైనందువలన ఇసుక యదేచ్చగా తరలించకు పోగలుగుతున్నారని చిన్న చిన్న వాగులు కుంటల్లో పేదలు ఎత్తే ఇసుకను తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ వేలకు వేలు ఫైన్లు వసూలు చేస్తున్నారు తప్ప, టిప్పర్లతో లక్షల విలువ చేసే ఇసుకను తరలిస్తున్న వారి జోలికి వెళ్లడం లేదని, అందుకనే ఒక్క టిప్పర్ కూడా పట్టుబడలేదని అన్నారు. బికేపల్లి, కోళ్లబైలు, పొన్నూటీపాలెం, పోతబోలు కొండామరిపల్లి, బసినికొండ తదితర రెవెన్యూ గ్రామాలలో అక్రమంగా మట్టిని తవ్వుకుని లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. జెసిబి శంకర, వేణు, మధు, అమర, శ్రీనివాసులు తదితరులు మట్టిని తరలించి డంపింగ్ చేస్తున్నా అధికారులకు కనపడకపోవడం దుర్మార్గం అన్నారు. బైపాస్ రోడ్డులో రాయల్ వుడ్ దగ్గర, అన్నమయ్య సర్కిల్, చేనేతనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు అనుకునే వేల టిప్పర్ ల మట్టిని తరలించి కుప్పలుగా పోస్తున్నా మామూళ్ల మత్తులో జోగుతున్నందునే మైనింగ్, ఎస్ఇబి, ఇరిగేషన్ రెవెన్యూ, పోలీసు అధికారులకు కంటపడలేదని విమర్శించారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష గారు మైనింగ్ మాఫియాను సహించేది లేదని ప్రకటించడాన్ని స్వాగతించామని, అందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.