contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్లలో విషాదం .. డిశ్చార్జ్ అయిన కొద్దిసేపటికే బాలింత మృతి

పల్నాడు జిల్లా –మాచర్ల: ప్రసవం అనంతరం ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్దిసేపటికే ఓ బాలింత అకస్మాత్తుగా మృతి చెందిన విషాద ఘటన మాచర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మంగాబాయి మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

బంధువుల వివరాల ప్రకారం.. మాచర్ల మండలం ఏ-కోనంపేట గ్రామానికి చెందిన నేనావత్ మంగాబాయికి చిన్న నాయక్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇది ఆమెకు తొలి కాన్పు. ప్రసవం కోసం మంగాబాయిని మాచర్ల పట్టణంలోని రామకృష్ణ ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మంగాబాయి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కుటుంబ సభ్యులు మంగాబాయిని ఇంటికి తీసుకెళ్లారు.

అయితే, ఇంటికి వెళ్లిన కొద్ది గంటలకే పరిస్థితి విషమించింది. సాయంత్రం 5 గంటల సమయంలో భోజనం చేస్తుండగా మంగాబాయి ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరిగి రామకృష్ణ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

మంగాబాయి మృతదేహాన్ని ఆసుపత్రిలోని బెడ్‌పై ఉంచి, ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించకుండానే డిశ్చార్జ్ చేశారని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు.

మంగాబాయి మృతికి అసలు కారణం ఏమిటో వైద్యులు స్పష్టంగా వెల్లడించాలని, సంబంధిత వైద్యులు వెంటనే ఆసుపత్రికి వచ్చి సమాధానం చెప్పాలని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఆసుపత్రి వైద్యుడి వివరణ

ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యుడు స్పందిస్తూ.. తన కుమారుడు విశాఖపట్నంలో ఉండటంతో శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్లానని, బాలింత మృతి చెందిన విషయం తెలియగానే వెంటనే మాచర్లకు బయలుదేరినట్లు తెలిపారు.

తొలికాన్పులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన మంగాబాయి కొద్దిగంటల్లోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లిని కోల్పోయిన నవజాత శిశువును చూసి ఏ-కోనంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బాలింత మృతికి వైద్య కారణాలు, ఆసుపత్రి వైపు నుంచి జరిగిన వైద్య ప్రక్రియలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :