మాసాయిపేట, తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జాతీయ పతాకాన్ని ఎగురవేసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని సూచించారు. జాతీయ గీతం, జాతీయ పతాకానికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని కోరారు.
అయితే గ్రామపంచాయతీకి చెందిన ఓ మహిళా వార్డు సభ్యురాలు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై పలువురు గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకం, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పసుల వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి రాణిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పంజా వెంకటేశం, గుడ్డి సిద్ధ రమేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








