చేగుంట–తూప్రాన్ : తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలంలోని రుక్మాపూర్, పెద్దశివునూర్ గ్రామాల్లో గురువారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఏ.వి. రామాంజనేయులు మాట్లాడుతూ, వర్షాకాలంలో వరి సాగు ముందు పచ్చి రొట్ట పంటలను మోకాలి ఎత్తు వరకు పెంచి కలియ దున్నితే యూరియా వినియోగాన్ని 20 నుంచి 30 శాతం వరకు తగ్గించవచ్చని తెలిపారు. అలాగే పచ్చి ఆకు ఎరువులు, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నేల సారవంతత పెరుగుతుందని చెప్పారు.
పంటలలో రసాయనాల వినియోగాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని సూచించిన ఆయన, పురుగుల నియంత్రణకు పక్షి స్థావరాలు, లింగ ఆకర్షణ బుట్టలు వినియోగించాలని రైతులకు సూచించారు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన అపరాలు, నూనె గింజల పంటలతో పంట మార్పిడి పాటించడం, సాగునీటిని ఆదా చేయడం, సేంద్రియ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని వివరించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అధిక దిగుబడులు ఇచ్చే మరియు ఎగుమతులకు అనుకూలమైన వరి విత్తనాలను అన్ని రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రేమ్, విజయలక్ష్మి, చేగుంట మండల వ్యవసాయాధికారి హరి ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారులు గౌతమి, భువనేశ్వరి, రుక్మాపూర్ సర్పంచ్ కాంచనపల్లి నవీన్, పెద్దశివునూర్ సర్పంచ్ ఎర్ర నర్సింలు, రుక్మాపూర్ ఉపసర్పంచ్ కోల్పుల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.








