జగిత్యాల జిల్లా, మెట్పల్లి పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల నియంత్రణపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి అగ్నిమాపక శాఖ అధికారి మధుకర్ మాట్లాడుతూ, అగ్నిప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. 1944 ఏప్రిల్ 14న ముంబాయి విక్టోరియా డాక్యార్డ్లోని ఒక నౌకలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మెట్పల్లి బస్టాండ్లో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్నిప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలో ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు. అలాగే అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించిన గోడ పత్రికలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు.
మధుకర్ మాట్లాడుతూ, ఈ వారోత్సవాల్లో భాగంగా వారంరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశముండటంతో, ప్రధాన కూడళ్లలో, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
అగ్నిప్రమాదాల సమయంలో మాత్రమే కాకుండా వరదలు, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తారని తెలిపారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు గాబరాపడకుండా ధైర్యంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 101కు లేదా సమీప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు.









